: పోయిస్ గార్డెన్ వెళ్లే చాన్స్ లేనట్టే... రిసార్టు నుంచి నేరుగా కర్ణాటక జైలుకు శశికళ!
ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్టులో ఉన్న శశికళ బయటకు రాగానే అరెస్ట్ చేసి, ఆమెను నేరుగా కర్ణాటకలోని జైలుకు తరలించాలని తమిళనాడు పోలీసులు భావిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి. తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు రిసార్టు ప్రాంతానికి చేరుకోగా, ఆమే స్వయంగా లొంగిపోతారన్న సమాచారం అందుకుని ప్రస్తుతం పోలీసులు బయటే వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం తరువాత ఆమె లొంగిపోకుంటే, పోలీసు చర్య మొదలవుతుందని ఓ అధికారి వెల్లడించారు. శశికళకు పోయిస్ గార్డెన్ కు వెళ్లే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. తాత్కాలికంగా చెన్నైలోని జైలుకు తరలించే అవకాశాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, గతంలో శిక్షను అనుభవించిన పరప్పన అగ్రహారం జైలుకే తీసుకెళ్లాలని పోలీసులు అనుకుంటున్నారు.