: తీర్పు ప్రభావం షురూ.. పన్నీర్ సెల్వానికి మద్దతు పలికిన పలువురు ఎమ్మెల్యేలు

శశికళ నటరాజన్‌ను దోషిగా తేల్చుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె సీఎం అయ్యే దారులు మూసుకుపోయిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం నివాసం వద్ద ఆయన మద్దతుదారుల ఆనందం అంబరాన్నంటుతోంది. అన్నాడీఎంకే నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు వస్తారని పన్నీర్ సెల్వం భావిస్తోన్న నేపథ్యంలో వారి అంచనాలు నిజమవుతున్నాయి. సెల్వానికి ఇప్పటికే ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యే చిన్నరాజ్ కూడా గోడ దూకేశారు. పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. అంతేగాక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ వైపునకు వచ్చేందుకు సిద్ధమయినట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి పన్నీర్ సెల్వానికి 10 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీల మద్దతు వచ్చింది.