: హిట్లర్ ను పోలిన వ్యక్తి... అరెస్టు చేసిన పోలీసులు
ఆయన రూపురేఖలు అచ్చం అడాల్ఫ్ హిట్లర్ లాగే ఉన్నాయి. అంతేగాక హిట్లర్ లాంటి హావభావాలు కనబరుస్తూ నడక కూడా అచ్చం అలాగే నడుస్తున్నాడు. దానికి తోడు అతడి పేరు హరాల్ట్ హిట్లర్. దీంతో ఆ వ్యక్తిని ఆస్ట్రియా పోలీసులు అరెస్టు చేశారు. హిట్లర్ జన్మించిన బ్రౌనౌ నివాసం ముందుకు వచ్చిన సదరు వ్యక్తి హిట్లర్‌లా నిలబడి స్టైల్‌గా ఫొటోకు పోజిచ్చాడు. అంతేగాక, నాటి నాజీ పోకడలు గొప్పవని ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే జర్మనీ సరిహద్దు వరకు వెళ్లి తిరిగొచ్చాడు. అప్పట్లో అడాల్ఫ్ హిట్లర్ సైతం ఆస్ట్రియా నుంచి జర్మనీలోకి 1913లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అతడు కావాలనే హిట్లర్‌లాగా ప్రవర్తించడం వల్ల తాము అదుపులోకి తీసుకున్నామని అక్కడి పోలీసులు తెలిపారు. అతడి ప్రవర్తన జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ఆస్ట్రియాలో నాజీల కాలంలో ఊచకోతలు జరిగిన నేపథ్యంలో వారు నాజీ లక్షణాలు కనిపించేవారిని అదుపులోకి తీసుకుంటారు.