: శశికళను అరెస్ట్ చేసేందుకు 35 వాహనాల్లో వచ్చి రిసార్టును దిగ్బంధించిన పోలీసులు
శశికళను దోషిగా ప్రకటిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు నిమిషాల్లోనే 35 వాహనాల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, గోల్డెన్ బే రిసార్టును చుట్టుముట్టి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రిసార్టు బయటి గేటు తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇప్పటికి ఇంకా శశికళ వద్దకు పోలీసులు వెళ్లనప్పటికీ, ఆమె తనంతట తానుగా వచ్చి లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. శశికళ లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఉన్నప్పటికీ, మరింత కాలం ఆమె బయటుంటే, రాజకీయ అనిశ్చితి కొనసాగుతుందని, రాష్ట్రంలో నిరసనలు జరగవచ్చని భావిస్తూ, ముందే ఆమెను జైలుకు తరలిస్తే, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థాయికి తేవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.