: తీర్పురాగానే ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయిన పోయెస్ గార్డెన్... శశికళ వర్గంలో తీవ్ర అలజడి
జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా ఉన్న ఆమె నెచ్చెలి శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. పోయెస్‌గార్డెన్‌లోని వేద నిలయం వద్ద ఇప్పటివరకు సందడి చేసిన శశికళ మద్దతుదారులు తీర్పు వెలవడగానే అక్కడి నుంచి ఒక్కసారిగా వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా ఇప్పుడు నిర్మానుష్యంగా మారి బోసిపోయి కనపడుతోంది. శశికళకు సుప్రీంకోర్టు శిక్ష విధించడంతో ఆమెకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే వర్గాల్లో కలకలం చెలరేగుతోంది. మరోవైపు ఆ రాష్ట్ర గవర్నర్ మరికాసేపట్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బలం కూడగట్టేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ప్రారంభించారు. శశికళ చెరసాలకు వెళ్లనున్న నేపథ్యంలో చెన్నైలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.