: రష్యాతో సంబంధాల నేపథ్యంలో.. రాజీనామా చేసిన ట్రంప్ భద్రతా సలహాదారుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా సలహాదారుడు మైఖేల్ ఫ్లిన్ తన పదవికి రాజీనామా చేశారు. రష్యాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో... ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ విధించబోయే ఆంక్షల గురించి రష్యా రాయబారితో ఫ్లిన్ మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే రష్యా అధికారితో ఫ్లిన్ మాట్లాడటం వివాదాస్పదమైంది. ఫ్లిన్ ను అడ్డుపెట్టుకుని రష్యా బ్లాక్ మెయిల్ చేస్తోందని వైట్ హౌస్ గతంలో హెచ్చరించింది. అంతేకాదు, ఫ్లిన్ ను వెంటనే తొలగించాలని ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్ చేశారు. ట్రంప్ అధికారంలోకి రాకముందే ఫ్లిన్ ఇలా వ్యవహరించడం ఏమిటంటూ పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, ఫ్లిన్ తన పదవికి రాజీనామా చేశారు. అతని స్థానంలో జనరల్ జోసెఫ్ కీత్ కెల్లాగ్ ను తాత్కాలిక భద్రతా సలహాదారుడిగా నియమించారు.