: 'గోడ' దూకిన ఎమ్మెల్యే.. మారు వేషంలో పన్నీర్ చెంతకు చేరిన శరవణన్!
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. పన్నీరు సెల్వం, శశికళ నటరాజన్‌ల మధ్య పోరు మరింత ముదురుతోంది. తన వైపు నుంచి ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలోకి జంప్ కాకుండా శశికళ.. రిసార్టులో వారిని ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిసార్టులోంచి పారిపోయి పన్నీర్ సెల్వం వద్దకు వచ్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి సినిమాను తలపించే ఓ సంఘటన జరిగింది. దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్... పన్నీర్ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అక్కడి నుంచి ఎలా తప్పించుకొని వచ్చాడో తెలుసుకుంటున్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సదరు ఎమ్మెల్యే శరవణన్ గోడ దూకి మరీ పన్నీర్ వద్దకు వచ్చేశారు. వారం రోజులుగా శశికళ క్యాంప్‌లో ఉన్న ఆయన.. అక్కడ మారు వేషం వేసి మరీ ఈ పని చేశారట. కాగా, శశికళ శిబిరంలో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నివాసాలపై తమిళ ప్రజలు దాడిచేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే, తమిళనాడులో 23 మంది ఎమ్మెల్యేల నివాసాలపై ఇలా రాళ్లు విసిరినట్లు పోలీసులు తెలిపారు.