: ఇలాగైతే తోకలు కత్తిరిస్తా... 'అనంత' నేతలకు చంద్రబాబు హెచ్చరికలు!


రాయలసీమలో కీలక జిల్లాగా ఉన్న అనంతపురంలో తెలుగుదేశం నేతల మధ్య నెలకొన్న విభేదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నేతల మధ్య నెలకొన్న గొడవలతో 2019 ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే పరిస్థితి ఏర్పడిందని, నేతలు మారకుంటే, తానే స్వయంగా రంగంలోకి దిగుతానని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పలువురు అనంత నేతలు చంద్రబాబును కలవగా, వారితో 45 నిమిషాల పాటు సమావేశమైన చంద్రబాబు, ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా లోపించిన సమన్వయంపై మాట్లాడినట్టు తెలుస్తోంది.

తనకు జిల్లా పరిస్థితులపై సమాచారం అందిందని, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని తానే స్వయంగా నిర్ణయిస్తానని చంద్రబాబు చెప్పారు. పార్టీకి నష్టం కలిగించేట్టు వ్యవహరిస్తే, తోకలు కత్తిరిస్తానని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఎవరైనా నేత మరొకరి ప్రాంతానికి వెళ్లాలని భావిస్తే, మరోసారి ఆలోచించుకోవాలని, ఈ పరిస్థితి పార్టీకి నష్టాన్ని కలిగిస్తే, మాత్రం తన చర్యలు తీవ్రంగా ఉంటాయని, ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతానని బాబు హెచ్చరించారు. కాగా, ఈ సమావేశానికి ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు జితేంద్రగౌడ్‌, ఈరన్నలు హాజరు కాలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News