: తమిళనాడు ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టు క్యాంపు బిల్లెంతంటే..!
గడచిన వారం రోజులుగా తమిళనాడు రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన గోల్డెన్ బే రిసార్ట్స్ లో శశికళ వర్గానికి వేసిన బిల్లు దాదాపు కోటి రూపాయలకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, వారికి కాపలాగా మరో 200 మంది బౌన్సర్లు, వారందరికీ మూడు పూటలా భోజనాలు, ఆపై విందు వినోదాలు, పార్టీలు... ఇలా వీళ్లకు సకల మర్యాదలూ అందించినందుకు బిల్లు ఇలా తడిసిమోపెడయింది.
వాస్తవానికి ఈ రిసార్టులో మూడు రకాల గదులున్నాయి. రోజుకు రూ. 5,500 అద్దెతో ట్రాంక్విల్ రూములు, రూ. 6,600 అద్దెతో బే వ్యూ రూములు, రూ. 9,900 అద్దెతో పారడైజ్ సూట్ రూములూ ఉన్నాయి. మొత్తం 60 గదులనూ బుక్ చేసుకుంటే, ఈ ఆరు రోజులకూ రూ. 25 లక్షల బిల్లు వస్తుంది. ఇక దీంతో పాటు తిండి, తిప్పల ఖర్చు కలిపితే, మరో రూ. 25 లక్షలు అవుతుంది. ఆపై ఎమ్మెల్యేలు, అక్కడున్న ఇతర శశికళ వర్గం వారికి కొత్త దుస్తుల నుంచి కోరిన అన్ని సదుపాయాలనూ కల్పించారు. ప్రత్యేక సేవలు కావాలని కోరిన వారికి అవి కూడా సమకూర్చారు. ఇలా వారం రోజులకు కోటి రూపాయల వరకూ ఖర్చు దాటిపోయినట్టు తెలుస్తోంది. మరిక ఈ బిల్లులను ఎవరు భరిస్తున్నారో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందోనన్న విషయం అనుమానాస్పదమే!