: నివురుగప్పిన నిప్పులా తమిళనాడు.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చుట్టూ 600 మంది పోలీసులు
శశికళ ఏ క్షణాన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని అనుకున్నారో కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో ఒకటే టెన్షన్. నిత్యం ఉద్రిక్తతే. మరో రకంగా చెప్పాలంటే ప్రస్తుతం తమిళనాడు పరిస్థితి టైం బాంబులా ఉంది. నేడు(మంగళవారం) అక్రమాస్తుల కేసులో శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదముందని భావిస్తున్న కేంద్రం పోలీసులను భారీగా మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 వేల మంది పోలీసులను మోహరించారు. ముఖ్యంగా శశికళ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న రిసార్టు చుట్టూ 600 మంది పోలీసులు కాపుకాశారు.
‘చిన్నమ్మ’కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా, గవర్నర్ ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా శశికళ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ తమిళనాడు పోలీసు శాఖను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ నటరాజన్, చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ తదితరులు సమావేశమై ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సహా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మోహరించిన పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.