: లాహార్ లోని పంజాబ్ అసెంబ్లీ సమీపంలో పేలుడు... ఏడుగురి మృతి
పాకిస్థాన్ లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. లాహోర్ లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ప్రభుత్వ కార్యాలయాలు, షాపులున్న ప్రాంతంలో రద్దీ నెలకొంది. ఇంతలో అదే మార్గంలోకి పాక్ కెమిస్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సంఘం ఆందోళన నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బాంబులు అమర్చిన వాహనం అక్కడికి వచ్చి ఆగింది. అంతలోనే భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి.
ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా, పలువురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, మృతుల్లో పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పాక్ కెమిస్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సంఘం నిర్వహిస్తున్న ఆందోళనను భగ్నం చేసేందుకు బాంబు పేలుడుకు పాల్పడ్డట్టు పోలీసులు భావిస్తున్నారు.