: గవర్నర్ ఆలస్యం చేస్తే రాష్ట్రం నష్టపోతుంది: స్టాలిన్
చెన్నైలో డీఎంకే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పార్టీ శాసనసభాపక్ష నేత స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే తమ ప్రత్యర్థి పార్టీ అని, దానికి మద్దతిచ్చే పరిస్థితే లేదని తేల్చిచెప్పారు. తామెవరికీ మద్దతివ్వడం లేదని అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని, కుర్చీని కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చొరవతీసుకోవాలని ఆయన సూచించారు. గవర్నర్ ఆలస్యం తీసుకునే కొద్దీ రాష్ట్రం నష్టపోతుందని చెప్పారు. ఈ సందర్భంగా 11 తీర్మానాలను డీఎంకే ఆమోదించింది. ఏప్రిల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం వెతకాలని ఆయన డిమాండ్ చేశారు.