: ‘రెండు కుక్కలు నరకానికి చేరాయి’ అంటూ కాశ్మీర్ యువకుడు ట్వీట్.. ఘాటుగా స్పందించిన సెహ్వాగ్!
జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదిన్ మిలిటెంట్లతో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మన జవాన్లు రఘుబీర్ సింగ్, బందోరియా గోపాల్ సింగ్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నిన్న ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై విమర్శలు కురిపిస్తూ, అపహాస్యంపాలు చేస్తూ కాశ్మీర్ యువత ప్రతి స్పందించారు.
తాను కాశ్మీర్ కు చెందిన వాడినని, వాస్తవాధీన రేఖను తొలగించాలని గర్వంగా చెబుతున్నానంటూ మహ్మద్ ఉమర్ అనే వ్యక్తి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ‘రెండు కుక్కలు నరకానికి చేరాయి’ అనే ట్వీట్ ను సెహ్వాగ్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. ఈ నేపథ్యంలో వీరూ ఘాటుగా స్పందిస్తూ.. ‘మీ లాంటి వాళ్లను వర్ణించేందుకు డిక్షనరీలో పదాలు లేవు. మీరు తొందరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తాను’ అని సెహ్వాగ్ అన్నాడు.