: భారత గడ్డపై వారిద్దరికీ తిరుగులేదా?


టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు జట్టుకు అద్వితీయ విజయాలు అందిస్తున్నారు. గతంలో భారత జట్టు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ల అండతో విజయాలు సాధించేది. బౌలర్లు రాణించినా బ్యాటింగ్ ప్రతిభే అధికం. గతంలో భారత జట్టు ఎర్రపల్లి ప్రసన్న, కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, వెంకటపతిరాజు, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్ వంటి దిగ్గజ బౌలర్ల సామర్థ్యంతో సుదీర్ఘకాలం విజయాలు సాధించింది. మనోజ్ ప్రభాకర్, నెహ్రా, ఇషాంత్, శ్రీశాంత్ తదితరులు అలా మెరుపులు మెరిపించి ఇలా మాయమయ్యేవారు. తరువాతి కాలంలో మునాఫ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ వంటివారు గాయాలతో సతమతమవుతూ కెరీర్ ను గాడినపెట్టేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.

జట్టుకు నాణ్యమైన స్పిన్నర్లు కావాల్సిన దశలో ఆల్ రౌండర్లుగా జట్టులో స్థానం సంపాదించుకున్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు నాణ్యమైన స్పిన్నర్లుగా ఎదిగారు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తూనే అద్భుతమైన బంతులతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ తాజాగా జరిగిన మూడు టెస్టు సిరీస్ లలో వరుసగా విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణం అశ్విన్, జడేజాలే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరిద్దరూ నాణ్యమైన బంతులతో వికెట్లు సాధిస్తూ జట్టుకు బ్రేక్ ఇస్తుండగా, టీమిండియా బ్యాట్స్ మన్ భారీ స్కోర్లతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో భారత్ ఎత్తుగడలకు ప్రత్యర్థులు దాసోహమవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ బౌలింగ్ విభాగం, ఆల్ రౌండర్ల విభాగంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. భారత గడ్డపై తిరుగులేని బౌలర్లుగా వారిద్దరూ రికార్డులు సాధిస్తున్నారు. 

  • Loading...

More Telugu News