: నది సమీపంలో ప్రమాదం.. నీటిలోకి జారిపోయిన 22 బోగీలు
అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 32 బోగీలతో వెళుతున్న ఓ గూడ్స్ రైలు నదిని దాటే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో, పట్టాలు తప్పిన బోగీలు నీటిలోకి జారుకున్నాయి. భారీ వర్షాల కారణంగా కొసుమన్స్ నది వరద నీటితో ఉప్పొంగుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో గూడ్సు రైల్లో ముగ్గురు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బోగీల్లో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని, ఆహార పదార్థాలు మాత్రం ఉన్నాయని రైలు యాజమాన్యం తెలిపింది. జరిగిన దానికి క్షమాపణలు చెప్పింది. గ్రేటర్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి రోజ్ విల్లేకు సరకు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.