: నిరసన కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి.. లేదంటే చర్యలే: ఏపీ హోంమంత్రి
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తమ వర్గం డిమాండ్లను నెరవేర్చుకునే క్రమంలో ఈ నెల 26న మరో దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే, ముద్రగడ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ... ప్రజాస్వామ్యంలో నిరసన కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉందని, అయితే ఆ క్రమంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని అన్నారు. నిరసన ప్రదర్శన చేసుకోవాలంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతి పొందాలని ఆయన సూచించారు. లేదంటే తామూ చూస్తూ ఊరుకోబోమని చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పిన ఆయన... ఎటువంటి అనుమతి లేకుండా నిరసనలు చేస్తామనడం భావ్యంకాదని అన్నారు.