: శశికళ భవితవ్యాన్ని తేల్చనున్న సుప్రీంకోర్టు!
తమిళనాడుకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న వీకే శశికళా నటరాజన్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన కేసులో సుప్రీంకోర్టు నేడు వాదనలు విననుంది. ఆమె ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపాలని చెన్నైకి చెందిన ఎన్జీవో సంస్థ సత్తా పంచాయత్ ఇయాక్కం జనరల్ సెక్రటరీ సెంథిల్ కుమార్ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్, జస్టిస్ ఎన్వీ రమణ, డీవై చంద్రచూద్ లతో కూడిన బెంచ్ వాదనలు విననుంది. ఆమె ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని గత వారంలో పిటిషన్ దాఖలు చేయగా, అత్యవసరంగా వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
కాగా, శశికళ ప్రమాణ స్వీకారం చేసి, ఆపై అక్రమాస్తుల కేసులో తీర్పు వ్యతిరేకంగా వస్తే, తమిళనాట జనజీవనం అస్తవ్యస్తమవుతుందని, నిరసనలు హోరెత్తుతాయని తన పిటిషన్ లో సెంథిల్ వివరించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని తుపాను పీడించిందని, ఆపై నోట్ల రద్దు, జయలలిత మరణంతో ఓ రకమైన శూన్యత ఆవరించిన రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల పాలు చేయవద్దని ఆయన కోరారు. ఈ కేసులో వాదనలను ధర్మాసనం నేడు విననుంది. శశికళ ప్రమాణ స్వీకారం చేయవచ్చా? లేక కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగాలా? అన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేేసే అవకాశాలు ఉన్నాయి.