: టీమిండియా మీదకు కొత్త అస్త్రాన్ని వదలనున్న అస్ట్రేలియా!
అతి త్వరలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు, కోహ్లీ సేనకు షాకిచ్చేందుకు మిచెల్ స్వెప్ సన్ అనే కీలక అస్త్రాన్ని తయారు చేసుకుందట. 23 ఏళ్ల స్వెప్ సన్ లెగ్ స్పిన్నర్ గా ఆస్ట్రేలియాలో రాణిస్తుండగా, అతడిని భారత పర్యటనకు ఎంపిక చేశారు. ఇక స్వెప్ సెన్ ఎలా బౌలింగ్ చేస్తాడన్న విషయం భారత ఆటగాళ్లకు తెలియకుండా ఆస్ట్రేలియా జాగ్రత్త పడుతూ వస్తుండటం విశేషం. ఇక స్వెప్ సన్ ను పొగడ్తలతో ముంచెత్తిన మాజీ కెప్టెన్ స్టీవ్ వా, భారత క్రికెటర్లను తన మాయాజాలంతో ఆశ్చర్యపరిచే సత్తా అతనికుందని అన్నాడు.
ఇక తనను భారత క్రికెటర్లతో పోల్చడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, ఇండియా పిచ్ లపై ఆడటం సవాళ్లతో కూడుకున్నదని అన్నాడు. తన బౌలింగ్ ఫుటేజ్ కూడా ఉందని, దాన్ని భారత క్రికెటర్లు చూసే వుంటారని చెప్పుకొచ్చాడు. కాగా, నాలుగు టెస్టు మ్యాచ్ లను ఆస్ట్రేలియా ఆడనుండగా, తొలి మ్యాచ్ 23న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.