: పన్నీర్, కాంగ్రెస్ ల మద్దతుతో మనం వస్తున్నాం: డీఎంకే శ్రేణులకు స్టాలిన్ సంకేతం
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడనుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నుంచి పార్టీ శ్రేణులకు సంకేతాలు అందాయి. పన్నీర్ సెల్వం, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో కరుణానిధి మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించడం ఖాయమని, మరో నాలుగైదు రోజుల్లో పార్టీలోని ప్రతి కార్యకర్త కోరికా నెరవేరుతుందని ఆయన స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనువుగా మార్చుకోవాలని డీఎంకే గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. శశికళను ఎలాగైనా సీఎం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా, స్టాలిన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కనీసం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ వెంట వచ్చినా, తన పార్టీ మద్దతిస్తుందన్న సంకేతాలు పంపారు. ఇప్పుడు పన్నీర్ వర్గంలో పట్టుమని పది మంది కూడా కనిపించని వేళ, శశికళ సీఎంగా కూర్చునేందుకు వీల్లేకుండా చూడాలని భావిస్తున్నారు. ఓ 20 మంది పన్నీర్ వైపు వచ్చినా, శశికళ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదని, ఆపై వారి మద్దతు తీసుకుని తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తానని, కాంగ్రెస్ కూడా కలిసొస్తుందని స్టాలిన్ గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది.