: కువత్తూరులో తిష్ట వేసిన మన్నార్ గుడి మాఫియా... శశికళ అండతో దురుసుతనం
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను దాచి వుంచిన గోల్డెన్ బే రిసార్ట్స్ ఉన్న కువత్తూరు ప్రాంతంలో మన్నార్ గుడి మాఫియా తిష్టవేసింది. గ్రామం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకున్న శశికళ వర్గం, అక్కడ బీభత్స వాతావరణాన్ని సృష్టిస్తోంది. నిన్న సాయంత్రం తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్న శశికళ, కువత్తూరుకు వస్తున్నారని తెలిసి, అక్కడికి మీడియా కూడా వెళ్లగా, మన్నార్ గుడి మాఫీయా ఆగడాలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మీడియా శిబిరంపై శశికళ మద్దతుదారులు విరుచుకుపడ్డారు.
అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి నిరసనగా పలువురు మీడియా ప్రతినిధులు ఆ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ ఆగిపోయి, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆపై పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వచ్చి మీడియా ప్రతినిధులను సముదాయించేందుకు ప్రయత్నించారు. ఇంకోసారి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.