: రిసార్టులోని తమిళ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు?... నేడు కోర్టుకు వాంగ్మూలాలు

తమిళనాడులో గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల వాంగ్మూలాలను సేకరించిన పోలీసులు, నేడు దాన్ని కోర్టుకు అందజేయనున్నారు. మద్రాసు హైకోర్టులో దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణలో భాగంగా ఎమ్మెల్యేలు ఏం అనుకుంటున్నారో తెలియజేయాలని కోర్టు ఆదేశించడంతో, రిసార్టుకు వెళ్లిన పోలీసులు, వారి వాదనను విని, దాన్ని లిఖిత రూపంలో తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా, ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు? రిసార్టులో బలవంతంగా ఉంచారా? సెల్ ఫోన్లు లాగేసుకున్నారా? గత ఐదు రోజులుగా మీ ఫోన్ల నుంచి ఎవరితో మాట్లాడారు? వంటి ప్రశ్నలను పోలీసులు సంధించినట్టు తెలుస్తోంది.

మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల లెక్కలపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, మ్యాజిక్ ఫిగర్ 117ను శశికళ చేరుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలుండగా, తమ వద్ద 127 మంది ఉన్నారని శశికళ వర్గం నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. మరోవైపు తన వర్గంలోకి వస్తారని పన్నీర్ సెల్వం భావిస్తున్న ఎమ్మెల్యేలు సైతం ఇంకా రాకపోవడం ఆయన వర్గంలో కొత్త గుబులును పుట్టిస్తోంది.

More Telugu News