: కశ్మీర్‌లో 11 గంటలు కొనసాగిన ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం.. కాల్పులకు నిరసనగా గ్రామస్తుల ఆందోళన


ఇటీవల కాలంలో ఎన్నడూ జరగని భారీ స్థాయిలో కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దక్షిణ కశ్మీర్‌లోని నాగబల్ అనే గ్రామంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఇద్దరు భారత జవాన్లు అమరులు కాగా ఓ పౌరుడు కూడా మృతి చెందాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. శనివారం రాత్రి 11 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్ ఆదివారం ఉదయం పది గంటల వరకు కొనసాగినట్టు ఆర్మీ పేర్కొంది. ఎన్‌కౌంటర్‌ నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకుని సమీపంలోని అడవుల్లోకి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబాలకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు.

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎదురుకాల్పులు జరిగిన ఇంటి వద్దకు చేరుకుని సైన్యానికి వ్యతిరేకంగా నినదించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లోనూ గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌బల్‌లో ఉగ్రవాదులున్నట్టు సైన్యానికి సమాచారం అందడంతో సైన్యం తనిఖీలు నిర్వహించింది. ఓ ఇంట్లో తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్లను లాన్స్‌నాయక్ రఘువీర్‌సింగ్‌, లాన్స్‌నాయక్‌ గోపాల్‌సింగ్‌ బడోరియాగా గుర్తించారు.

  • Loading...

More Telugu News