: మరో 11 మంది ఎమ్మెల్యేలు ‘పన్నీర్’ వెంట వెళితే..చిన్నమ్మకు చిక్కులే!
తమిళనాడులో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగినంత మద్దతు ఉందంటూ శశికళ పదే పదే ప్రకటిస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, పన్నీర్ సెల్వం విషయాని కొస్తే, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 7. శశికళ వర్గంలోని పదకొండు మంది ఎమ్మెల్యేలు కనుక పన్నీర్ గూటికి చేరి, ఆయనకు మద్దతు ప్రకటిస్తే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారిపోతాయి. అప్పుడు, పన్నీర్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 18 అవుతుంది. ఇక శశికళ తన సొంత బలంతో సీఎం అయ్యే అవకాశాలు ఉండవు. ఇతర పార్టీలపై ఆమె ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఆమెకు ఎలాగూ మద్దతు ఇవ్వవనే విషయమై ఆ పార్టీల నాయకులు తరచుగా చేస్తున్న ప్రకటనల ద్వారా స్పష్టం అవుతోంది. అవసరమైతే, పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తామని ఇప్పటికే డీఎంకే ప్రకటించింది. ఒకవేళ, శశికళ వర్గం ఎమ్మెల్యేల్లో పదకొండు మంది కనుక పన్నీర్ గూటికి చేరితే డీఎంకే మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయమవుతుంది.
ఇదే కనుక జరిగితే, పన్నీర్ కు సీఎం కుర్చీ దక్కడం, చిన్నమ్మకు నిరాశ ఎదురవడం తప్పదని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా, గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల్లో ఇరవై మంది అసంతృప్తితో ఉన్నారని, వారిని తన వైపు తిప్పుకునేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను పన్నీర్ కలిసేందుకు ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తుండడం గమనార్హం.