: రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇచ్చిన నారా బ్రాహ్మణి.. ఆ ఆలోచనే లేదని వ్యాఖ్య
తాను రాజకీయాల్లోకి రాబోతున్నాననంటూ వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఖండించారు. తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని పేర్కొన్నారు. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమె అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్‌కు శనివారం హాజయ్యారు. ఈ సందర్భంగా ఓ పత్రికతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.
మహిళా సాధికారతకు మహిళా పార్లమెంట్ లాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తనకు ఒక్కో అంశంలో ఒక్కో మార్గదర్శకులు, స్ఫూర్తిదాతలు ఉన్నారని బ్రాహ్మణి పేర్కొన్నారు. రోల్ మోడల్స్ ఉన్నట్టే మనకు మార్గదర్శనం చేసేవారూ కూడా ఎంతో అవసరమని తెలిపారు. కొందరికి సైనా నెహ్వాల్, మరికొందరికి సానియామీర్జా, పీవీ సింధు లాంటి వాళ్లు ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. మహిళ విద్యావంతురాలైతే కుటుంబం తద్వారా సమాజం, దేశం కూడా పురోగతి సాధిస్తుందని తెలిపారు. హెరిటేజ్ సంస్థలో మహిళా సాధికారత కోసం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తనకి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని, అటువంటి వార్తలు పూర్తి నిరాధారమని బ్రాహ్మణి తేల్చి చెప్పారు.