: ముంబయి చేరుకున్న ఈజిప్టు స్థూల కాయురాలు... ఆరు నెలల పాటు కొనసాగనున్న చికిత్స!


అధిక బరువుతో బాధపడుతున్న ఈజిప్టు దేశీయురాలు ఇమాన్‌ అహ్మద్‌ అబ్దులతి భారత్ చేరుకున్నారు. ఆమెకు ఉచితంగా ఆపరేషన్ చేస్తానని ముంబయి వైద్యుడు ముఫజల్‌ లక్డావాలా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 500 కిలోల బరువు ఉన్న ఆమె తన సోదరితో పాటు అక్కడి విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఫ్రైటర్ విమానంలో వచ్చారు. ప్ర‌త్యేకంగా ఆమె కోసం ఏర్పాటు చేసిన‌ కార్గో విమానంలో  ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గోసెక్షన్ గేట్ నెం.5 వద్దకు తెల్లవారుజామున చేరుకున్న ఆమెను ఆ విమానం నుంచి దించడానికి 40 నిమిషాల సమయం పట్టింది. అనంత‌రం చికిత్స చేయించుకోడానికి ఆమె సైఫీ ఆసుప‌త్రికి చేరుకున్నారు.

ఆమెను చూసేందుకు ఆసుప‌త్రి వద్దకు భారీ సంఖ్యలో జనం వ‌చ్చారు. ఆమెకు చికిత్స చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆ ఆసుప‌త్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.జె. బాపాయ్ తెలిపారు. ఆమెతో పాటు ఈజిప్టు కాన్సులేట్ జనరల్ అహ్మద్ ఖలీ కూడా అక్క‌డ‌కు వ‌చ్చార‌ని తెలిపారు. ఆసుప‌త్రి వ‌ద్ద  పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటుచేశారు. ఆసుప‌త్రి మొదటి అంతస్తులో ఉన్న ప్రత్యేకమైన గదిలోకి స‌ద‌రు మ‌హిళ‌ను తీసుకెళ్లేందుకు పేషెంటు బెడ్‌కు తాళ్లను కట్టి, క్రేన్ సాయంతో ఆ బెడ్‌ను మొదటి అంతస్తు వరకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ఆరు నెలల పాటు ఆమె ఆ ఆసుప‌త్రిలో ఉండ‌నున్నారు.

  • Loading...

More Telugu News