: ఈడీ స్వాధీనం చేసుకోనున్న జగన్ ఆస్తుల వివరాలు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల స్వాధీనానికి సిద్ధమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాము స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఈడీ స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల్లో హైదరాబాద్‌లోని సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఈ ఆస్తులన్నీ షలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని నవీనగర్‌లో ఈ కంపెనీ 2623 చదరపు గజాల ప్లాటును కొనుగోలు చేసి అందులో ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఇందులోనే సాక్షి దినపత్రిక, టీవీ చానల్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
ఈ భవనం పక్కనే మరో వెయ్యి చదరపు గజాల స్థలంలో సెల్లార్, సబ్ సెల్లార్తోపాటు నాలుగు అంతస్తుల భవనం ఉంది. ఈ భవనాలతోపాటు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్నజగన్ విలాసవంతమైన నివాసం ఉంది. అలాగే కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లపల్లిలో ఉన్న హరీశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన 7.85 ఎకరాల భూమి, సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌లో నివిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన 9680 చదరపు గజాల స్థలం, మహేశ్వరం మండలం సర్దార్ నగర్ రెవెన్యూ గ్రామంలో ఉన్న 32.31 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది.