: రాజకీయాల్లోకి నేనొస్తే రచ్చరచ్చే.. రాకూడదని కోరుకోండంటూ కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు
విలక్షణ నటుడు కమలహాసన్ తమిళ రాజకీయాలపై అంతే విలక్షణంగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రాకూడదని ప్రతి ఒక్కరు కోరుకోవాలని సూచించారు. ఒకవేళ తాను కనుక రాజకీయాల్లో అడుగుపెడితే రచ్చరచ్చేనని హెచ్చరించారు. ఇప్పటి వరకైతే తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని పేర్కొన్న ఆయన, వస్తే మాత్రం అది మామూలుగా ఉండదన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆరు దశాబ్దాలుగా తమిళనాడుకు రాజకీయ నాయకులు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన వాగ్దానాలను ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ నెరవేర్చలేదని ఆరోపించారు. తమకు ఫలితాలు మాత్రమే కావాలని స్పష్టం చేశారు.
శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఉన్న అర్హతలు తనకే కాదు, ప్రజలకు కూడా తెలియదని కమల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి చుట్టూ ఏళ్లపాటు తిరగడం అర్హతగా భావించకూడదన్నారు. తాను ఒక న్యాయవాది కుమారుడినని, అంతమాత్రాన తాను కోర్టులో ఏదైనా కేసులో వాదన వినిపించేయగలనని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ‘మీ ఆవేశం చూస్తుంటే మీలో ఒక ఔత్సాహిక రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు’ అన్న ప్రశ్నకు కమల్ విలక్షణంగా స్పందించారు. తానలా అనుకోవడం లేదన్నారు. మీకు కనుక దేవుడిపై నమ్మకముంటే తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుకోవాలంటూ సలహా ఇచ్చారు. తమలాంటి వాళ్లు చాలా ఆగ్రహంగా ఉన్నారని, రాజకీయాల్లో అడుగుపెడితే మామూలుగా రామని, తుపాకులు చేతపట్టుకుని వస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అలా జరగకూడదనే తాను అనుకుంటున్నట్టు కమల్ వివరించారు.