: పన్నీర్ గూటికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. గత సాయానికి రుణం తీర్చుకునేందుకు సిద్ధం!
కుర్చీలాటలో బిజీగా ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎవరికి వారే బలాబలాలు కూడగట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో ముగ్గురు అన్నాడీఎంకే శాసనసభ్యులు పన్నీర్‌కు జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన తమకు చేసిన సాయానికి కృతజ్ఞతగా అండగా నిలవాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
పన్నీర్‌కు మద్దతు ఇస్తున్న వారిలో నాగపట్టినం జిల్లాలోని మైలాడుతురై ఎమ్మెల్యే రాధాకృష్ణన్, సీర్గాలి ఎమ్మెల్యే భారతి, పూంపుహార్ ఎమ్మెల్యే పౌనరాజ్‌లు ఉన్నారు. గత ఎన్నికల్లో సీట్లు వచ్చే పరిస్థితి లేని తమకు పన్నీర్ సెల్వం అండగా నిలిచారని, అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి సీట్లు ఇప్పించారని చెబుతున్నారు. అంతేకాక తమ గెలుపుకోసం పన్నీర్ కష్టపడ్డారని, తమకోసం ప్రచారం సైతం నిర్వహించారని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేస్తున్న ధర్మయుద్ధానికి మద్దతు పలకాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.