: ఉత్తరప్రదేశ్‌లో నేడే తొలి అంకం.. 73 నియోజకవర్గాల్లో పోలింగ్
అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో నేడు(శనివారం) తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. మీరట్, ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాల్లో మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. బరిలో ఉన్న 839 మంది అభ్యర్థుల తలరాతలు మార్చేందుకు 2.6 కోట్ల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. బరిలో పలువురు ప్రముఖులు ఉండడంతో తొలి విడత ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ బీజేపీ తరఫున నోయిడా నుంచి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ అల్లుడు రాహుల్ సింగ్ బులంద్‌షహర్ జిల్లా సికిందరాబాద్ నుంచి ఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలో మజ్లిస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కాగా తొలి దశ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీద్ ఇమామ్ సయ్యద్ మహ్మద్ నురూర్ రెహ్మన్ బర్కతీ ఓటర్లకు పిలపునివ్వడం గమనార్హం.