: పన్నీర్ సెల్వం వర్గీయుల్లో నూతనోత్సాహం!
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్‌కు ఎదురుతిరిగి పోరాడుతున్న పన్నీర్ సెల్వం వర్గంలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. పన్నీర్ సెల్వం క్రమంగా బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఆయనకు అన్నీ కలిసొస్తున్నట్టు కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు శశికళకు సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని ప్రచారం మొదలైంది. దీంతో పన్నీర్ సెల్వం వర్గంలో నూతనోత్సాహం కనపడుతోంది. నిన్న గవర్నర్‌తో పన్నీర్ సెల్వం భేటీ అయిన తరువాతి నుంచి వారిలో సంతోషం కనపడుతోంది. అయితే, శశికళపై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశముందని ఈ రోజు వార్తలు రావడంతో వారు తమకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ కేసులో ఆమెను కోర్టు దోషిగా నిర్ణయిస్తే ఆమె కొంత కాలం పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదు.