: వంటింట్లో పాత్రలపై సైతం నాన్న పేరే ఉంటుంది!: విజయవాడలో ఎంపీ కవిత
అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొని మాట్లాడారు. మహిళలపై పెరుగుతున్న వివక్ష ఆగిపోవాలని ఆమె అన్నారు. సాధారణంగా మన ఇళ్లలో నాన్న తన ఇంటికి మహారాణి తన భార్యే అని చెప్పుకుంటారని, అయితే మనం వంటింట్లోకి వెళ్లి చూస్తే అక్కడి వంట పాత్రలపై కూడా నాన్న పేరే కనపడుతుందే తప్ప అమ్మ పేరు మాత్రం కనపడదని ఆమె ఎద్దేవా చేశారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించి తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో ఎంతో మంచి అంశాలపై చర్చిస్తున్నారని కవిత చెప్పారు. చదువు లేకపోయినప్పటికీ భారత్‌లో ఎంతో మంది స్త్రీలు జీవితాన్ని చదువుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గ్రామాల్లో మహిళలు పొదుపుగా డబ్బుని వినియోగిస్తుంటారని చెప్పారు. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్ అంటూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.