: ‘గూగుల్’లో ఆయనపై చాలా జోక్స్ కనిపిస్తాయి: రాహుల్ పై మోదీ జోక్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్ లో ని బిజ్నోర్ లో ఎన్నికల బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, ‘చిన్న పిల్లోడిలా ప్రవర్తించే ఆయన పేరును ‘గూగుల్’ లో శోధిస్తే, ఆయనపై చాలా జోక్స్ కనిపిస్తాయి. ఏ నేతపైనా ఇన్ని జోక్స్ రాలేదు’ అని ఆయన అనడంతో, సభకు హాజరైన వారు నవ్వులు కురిపించారు. ఆయన ప్రవర్తన కారణంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైతం దూరంగా ఉంటుంటే..సమాజ్ వాద్ పార్టీ నేత, యూపీ సీఎం అఖిలేశ్ మాత్రం ఆయనకు దగ్గరయ్యారని విమర్శించారు. ఈ వ్యవహారం చూస్తుంటే అఖిలేశ్ జ్ఞానంపై తనకు అనుమానం కలుగుతోందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని, కాంగ్రెస్, ఎస్సీలకు నిరాశ తప్పదని అన్నారు. యూపీలో ప్రజాపాలన గాడి తప్పిందని, ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయిందని, యువతను, రైతులను అఖిలేష్ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని మోదీ ప్రశ్నించారు.