: మా నాయనమ్మే నా రోల్ మోడల్: మనీషా కొయిరాలా


తన నాయనమ్మే తన రోల్ మోడల్ అని ప్రముఖ నటి మనీషా కొయిరాలా చెప్పింది. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలుకరించగా... తనకు రోల్ మోడల్ గా చాలా మంది ఉన్నప్పటికీ, కుటుంబ పరంగా చూస్తే తమ నాయనమ్మే తన రోల్ మోడల్ అని పేర్కొంది. తన నాయనమ్మ సంఘ సంస్కర్త అని, తన చదువు, ఆటలు, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం వెనుక తన తల్లి, నాయనమ్మల పాత్ర ఎంతో ఉందని అన్నారు.

ఈ ప్రపంచానికి సృష్టికర్తలము తాము అనే విషయాన్ని బాలికలు అందరూ గుర్తుంచుకోవాలని మనీషా కొయిరాలా సూచించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, వేల సంఖ్యలో మహిళలు ఇక్కడకు వచ్చారని, సమాజంలో మహిళల పాత్రపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తానని అన్నారు. ఆరోగ్యం, వ్యక్తిగత పర్యవేక్షణ, కేన్సర్ వ్యాధి,  మహిళా సాధికారత, మహిళలకు సంబంధించిన పలు అంశాలను ఈ సదస్సులో ప్రస్తావించనున్నట్లు చెప్పారు.

కేన్సర్ వ్యాధితో బాధ పడిన తాను  ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పారు. మహిళా సాధికారత గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరముందని, ఈ సదస్సును ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని అన్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత కథను తెరకెక్కించనున్న చిత్రం గురించి ప్రశ్నించగా.. సంజయ్ దత్ తల్లి నర్గీస్ దత్ పాత్రను ఈ చిత్రంలో తాను పోషిస్తున్నాని, ఈ పాత్ర తనకు లభించడం సంతోషంగా ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News