: శశికళకు మరో షాక్.. భూమి లాక్కున్నారని స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు
తమిళనాడులో అవినీతికి, అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అరప్పోర్ ఇయక్కమ్ అనే స్వచ్ఛంద సంస్థ అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్‌పై ఫిర్యాదు చేసింది. శశికళతో పాటు ఆమె కుటుంబసభ్యులు భూమి లాక్కున్నారని ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు తెలిపింది. ఇరవై ఏళ్లలో రాష్ట్రంలోని పలు చోట్ల భూములు లాక్కున్న వ్యవహారాలతో వారికి సంబంధం ఉందని సంస్థ చెప్పింది. వాటిపై సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొంది. వారు పలుచోట్ల ప్రభుత్వ భూములు, సరస్సులతో సహా ప్రైవేటు భూములు కూడా అక్రమంగా లాక్కున్నారని తెలిపింది.
అయితే, పలువురు ఇచ్చిన ఫిర్యాదులపై స్థానిక పోలీసులు స్పందించలేదని పేర్కొంది. శశికళ కుటుంబం సిరుతవూర్, పయనూర్, కరుంకుజిపాలెం, తిరుపొరూర్, కాంచీపురాల్లోని గ్రామాల్లో ఎన్నో సర్వే నెంబర్లను ఆక్రమించుకుందని తెలిపింది. అంతేగాక వారు లాక్కొన్న 112 ఎకరాల భూములకు పోలీసులే కాపలా కాస్తున్నారని పేర్కొంది. ఈ ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.