: రేపు ముంబై చేరుకోనున్న ఈజిప్టు భారీ స్థూలకాయురాలు... శస్త్రచికిత్సకు రంగం సిద్ధం
ప్రపంచంలోనే అత్యంత భారీ కాయంతో (సుమారు 500 కేజీల బరువుతో) తీవ్ర అవస్థలు పడుతున్న ఈజిప్ట్ మహిళ ఎమన్ అహ్మద్ (36) రేపు ఉదయం ముంబై చేరుకోనున్నారు. సైఫీ హాస్పి టల్ లో ఆమెకు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. హాస్పిటల్ లో ఆమె కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేస్తున్నారు. బేరియాట్రిక్ శస్త్రచికిత్సా నిపుణుడు డాక్టర్ ముఫజాల్ లక్డవాలా, కార్డియాలజిస్ట్, కార్డియాక్ సర్జన్, ఎండోక్రైనాలజిస్ట్, చెస్ట్ ఫిజీషియన్, అనస్థీషియా తదితర వైద్య నిపుణుల బృందం ఎమన్ కు బరువు తగ్గించే ఆపరేషన్ లో పాల్గొననున్నారు.
ఈజిప్ట్ ఎయిర్ బస్ 300-600 సరుకు రవాణా విమానంలో ఎమన్ ను తీసుకురానున్నారు. శనివారం తెల్లవారుజామున 4.10 గంటలకు సదరు విమానం ముంబై విమానాశ్రయానికి చేరుకోనుంది. సాధారణ విమానంలో సీట్లు ఉండడం వల్ల ఆమెను తరలించడం సాధ్యం కాదని భావించి ప్రత్యేకంగా సరుకు రవాణా విమానం ఏర్పాటు చేశారు. భారీ బరువు కారణంగా ఎమన్ గత 25 ఏళ్లుగా కైరోలో తన ఇంటికే పరిమితం అయ్యారు.