: అదే జరిగితే పన్నీర్ పరిస్థితి ‘రొట్టె విరిగి నేతిలో పడినట్టే’!
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్న శశికళ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలవడంతో తమిళ రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు గవర్నర్ నిర్ణయంపైనే వారిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు? అన్న అంశంపై విశ్లేషకులు పలు అంచనాలు వేస్తున్నారు.
అసెంబ్లీలో బల నిరూపణకు పన్నీర్‌కు గవర్నర్ ఐదు రోజుల సమయం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే మంగళవారం లేదంటే బుధవారాల్లో పన్నీర్ సెల్వం బలప్రదర్శన ఉండే అవకాశం ఉంది. అయితే అంతకుముందే అంటే సోమవారమే అక్రమాస్తుల కేసుకు సంబంధించిన కేసులో శశికళపై కోర్టు తీర్పు వస్తుంది. ఒకవేళ కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే పన్నీర్ సెల్వం పంట పండినట్టేనని చెబుతున్నారు. కోర్టు తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఆమె బలనిరూపణకు సిద్ధపడితే ఏం జరుగుతుందన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
ఒకవేళ పన్నీర్ సెల్వం బలనిరూపణకు సిద్ధపడితే ఆయనకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీకి 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సింది 118 మందే. కాబట్టి వారి మద్దతుతో పన్నీర్ సెల్వం గట్టెక్కడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు.