: ఏపీలో ఇండియన్ బ్యాంకు రూ.5 వేల కోట్ల పెట్టుబడి.. అమరావతిలో జోన్ కార్యాలయం!
నవ్యాంధ్రలో రూ.5 వేల కోట్ల పెట్టుబడికి ఇండియన్ బ్యాంకు ముందుకొచ్చింది. మౌలిక సదుపాయాలు, విద్య, ఆతిథ్యం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్‌కుమార్ జైన్ తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్యాంకు ప్రతిపాదనను స్వాగతించిన చంద్రబాబు అమరావతిలో బ్యాంకు జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మహేశ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. అలాగే బ్రాహ్మణ, కాపు, ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల రుణాలను ఇండియన్ బ్యాంకు ద్వారా అందించేందుకు ఈ భేటీలో ఒప్పందం కుదిరింది. ఇండియన్ బ్యాంకు ఇచ్చే రుణాల్లో సగం వ్యవసాయ రుణాలేనని సీఎంకు జైన్ వివరించారు.