: అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.. తమిళనాడు సంక్షోభంపై నెటిజన్ల తీర్పు!
తమిళనాడులో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారా? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా, ఈ రోజు సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అవడం, ‘శుభవార్త వింటాము’ అంటూ ఆయన ప్రకటించడం తెలిసిందే. కాగా, మరి కొద్ది సేపట్లో గవర్నర్ ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కలవనున్నారు.
ఈ క్రమంలో, తమిళనాట అనిశ్చితిపై ఆన్ లైన్ లో నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న నెటిజన్లు అనూహ్యమైన తీర్పును ఇచ్చారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలని, ఆ తర్వాత అసెంబ్లీకి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని 54 శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడగా, రాష్ట్రానికి సీఎంగా ఎవరు ఉండాలనేది అసెంబ్లీ నిర్ణయిస్తుందని 34 శాతం మంది, సీఎం ఎవరనేది అన్నాడీఎంకే నేతలు నిర్ణయిస్తారని 10 శాతం మంది నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలిపారు.