: అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అందరూ వారి వసతి గృహాల్లో ఉన్నారు: షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది
అన్నాడీఎంకేకు చెందిన 130 మంది ఎమ్మెల్యేలంతా ఎక్కడ ఉన్నారంటూ తమిళనాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది బాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది వీఎం రాజేంద్రన్ స్పందిస్తూ, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అందరూ వారి వసతి గృహాల్లో క్షేమంగా ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను అత్యవసర కేసుగా పరిగణించాలన్న పిటిషన్ దారు అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు.
కాగా, శశికళ శిబిరంలో అజ్ఞాతంలో వున్న అన్నా డీఏంకే ఎమ్మెల్యేలను విడిపించాలంటూ ఓపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీజీపీని ఆదేశిస్తే, మరోపక్క ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు వారంతా స్వేచ్చగా, క్షేమంగా ఉన్నారంటూ తెలపడం గమనించదగ్గ విషయం. మరోపక్క అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి శశికళ వర్గీయులు తరలించడంపై డీఎంకే నేత స్టాలిన్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలందరినీ స్టార్ హోటల్లో ఉంచడం ప్రజాస్వామ్యాన్ని అణచి వేసే చర్య అని, గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. రహస్య ప్రాంతంలో ఉన్నఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి ఖుష్బూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రహస్య ప్రాంతానికి తరలివెళ్లిన ఆ ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం ఉందా? అని ఆమె ప్రశ్నించింది.