: ఇక మేము సిద్ధం.. శశికళ చేస్తోన్న ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇస్తాం: పన్నీర్ సెల్వం
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ మరోసారి అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్‌పై మండిపడ్డారు. పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను కొంటున్నారని, కుట్రలు పన్నుతున్నారని శశికళ వర్గం కొద్దిసేపటి క్రితం మరోసారి ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే, శశికళ చేస్తోన్న ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పడానికి తాము సిద్ధమని పన్నీర్ సెల్వం ప్రకటించారు.
అమ్మ ఆసుపత్రిలో చేరిన 24 రోజుల తరువాత మాత్రమే శశికళ తనతో మాట్లాడారని, ఆ సమయంలో అమ్మ కోలుకుంటున్నారని చెప్పారని ఆయన అన్నారు. జయలలిత మృతిపై విచారణ జరిపించాల్సిందేనని మరోసారి అన్నారు. శశికళ అరాచకాలను అడ్డుకుంటానని వ్యాఖ్యానించారు. సీఎం పదవి కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు మరికాసేపట్లో ఎయిర్‌పోర్టుకి చేరుకోనున్నారు.