: రాత్రంతా శశికళ క్యాంప్ లో ఎంజాయ్ చేసి... 10 మందితో పాటు పన్నీర్ పక్షాన చేరాడు!
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. శశికళ గూటి నుంచి ఒక్కొక్కరుగా వస్తున్న నేతలలో శిబిరం కళకళలాడుతోంది. తాజాగా పార్టీ ప్రిసీడింగ్ ఛైర్మన్ మధుసూదన్ కూడా శశికళకు హ్యాండిచ్చి, పన్నీర్ తో జత కలిశారు. మధుసూదన్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. నిన్న రాత్రంతా శశికళ ఏర్పాటు చేసిన క్యాంపులో మధుసూదన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ, రోజు మారేసరికి చిన్నమ్మకు షాకిచ్చి, పన్నీర్ కు జై కొట్టారు.
ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ, తమ మద్దతు ముమ్మాటికీ పన్నీర్ కే అని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీని రౌడీల చేతుల్లోకి వెళ్లనీయబోమని తేల్చి చెప్పారు. పార్టీని రక్షించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పారు. పన్నీర్ సెల్వంకు మద్దతు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. జయలలిత మరణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శశికళ ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యానికే కళంకం ఏర్పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, మధుసూదన్ ను కూడా శశికళ బెదిరించిందని మండిపడ్డారు.