: సానుభూతి ఓట్ల కోసం తోడబుట్టిన వాడిని చంపించిన యూపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఎన్నికల్లో గెలిచేందుకు బరిలో దిగిన అభ్యర్థులు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయని మరోసారి నిరూపించిందీ ఘటన. తాను గెలిచేందుకు అవసరమైన ఓట్లను సానుభూతి రూపంలో సంపాదించుకునే ఆలోచనలో తోడబుట్టిన వాడినే చంపించాడో ఎమ్మెల్యే అభ్యర్థి. విచారణలో దొరికిపోయి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఖురా నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మనోజ్ కుమార్ గౌతమ్, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్లాన్ చేసి, తన సోదరుడు వినోద్, కుటుంబ మిత్రుడు సచిన్ లను కిరాయి హంతకులతో హత్య చేయించాడు.
ఆ సమయంలో తాను ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కుమారుడితో ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు మనోజ్. వీరిద్దరి మృతదేహాలూ ఓ మామిడి తోటలో పడివుండటం కలకలం రేపగా, పోలీసులు విచారించారు. ఫోన్ కాల్స్ పరిశీలిస్తే, గౌతమ్ హత్య చేయించినట్టు తేలింది. విచారణలో తొలుత విలపిస్తూ మాట్లాడిన గౌతమ్, ఆపై లక్ష రూపాయలిచ్చి హత్యలకు పాల్పడ్డానని అంగీకరించాడు. అతన్ని జైలుకు తరలించిన పోలీసులు, ఓ హంతకుడిని అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు.