: నాడు జయలలితను క్షమించాలని వేడుకుంటూ శశికళ రాసిన లేఖ పూర్తి పాఠం!
"నా బంధువులు, మిత్రులు, నేను పోయిస్ గార్డెన్ లో ఉంటున్న సమయంలో, నా పేరును వాడుకుని కొందరు అక్రమాలకు పాల్పడ్డారు. అన్నాడీఎంకేకు చెడ్డపేరును తెచ్చేలా వ్యవహరించారు. జయలలితకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగాయి. ఇది మన్నించరానిది. కలలో కూడా నేను మీకు ద్రోహం తలపెట్టను. నేను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలని గానీ, పార్టీ పదవులు కట్టబెట్టాలని కానీ ఏనాడూ కోరుకోలేదు.
అసలు ప్రజా జీవితంలోకి ప్రవేశించాలన్న ఆశ నాకు ఎప్పటికీ లేదు. ప్రమాణ పూర్తిగా నాకు ఏ పదవులూ వద్దు. వాటిని నేను ఆశించడం లేదు. నన్ను క్షమించి మళ్లీ దగ్గరికి తీసుకోండి" అని 2011లో శశికళ రాసిన లేఖలోని అంశాలను పన్నీర్ చదివి వినిపించారు. ఇదిలావుంటే, తనకు తెలిసిన అంశాల్లో పది శాతమే బయట పెట్టానని, మరో 90 శాతం బయటపెట్టేలా చేయవద్దని నిన్న పన్నీర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇంకెన్ని సంచలన విషయాలు బయట పెడతాడన్న ఉత్కంఠ నెలకొని వుంది.