: విజయవాడలో దలైలామా విమానం ల్యాండింగ్ కు సమస్య... గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం!
విజయవాడ నగరాన్ని పొగమంచు దట్టంగా అలముకుంది. ఈ నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయంలో విమానాలు దిగడానికి వీలులేకుండా పోయింది. రన్ వే సరిగా కనిపించకపోవడంతో తీవ్ర సమస్య తలెత్తింది. దీంతో, ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ కావడానికి అవకాశం లేకపోవడంతో... గాల్లోనే చక్కర్లు కొడుతోంది. ఈ విమానంలో బౌద్ధ గురువు దలైలామా ఉండటంతో... అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. విమానం ల్యాండ్ అవడానికి వాతావరణం అనుకూలంగా లేదని పైలట్ కు విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాస్త ఎండ వస్తేనే కాని, పొగమంచు విడిపోయే అవకాశం లేదని వారు చెప్పారు. విమానాశ్రయంలోని రన్ వే పెద్దది కాకపోవడం కూడా మరో ముఖ్యమైన సమస్యగా అధికారులు చెబుతున్నారు. మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు దలైలామా ఢిల్లీ నుంచి విజయవాడకు బయల్దేరి వచ్చారు.