: నా తాగుడు గురించి మోదీకి అవసరమా?.. ప్రధాని దిగజారి మాట్లాడారు: ఆప్ ఎంపీ
తన తాగుడు గురించి పార్లమెంటులో ప్రస్తావించిన ప్రధాని మోదీపై ఆప్ ఎంపీ భగవంత్ మండిపడ్డారు. తాను మద్యం సేవించే విషయం గురించి ఆయనకు ఏం అవసరమని ప్రశ్నించిన భగవంత్.. తన మర్యాదకు భంగం కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, చార్వక తత్వశాస్త్రం గురించి చెప్పారు.
ఈ సందర్భంగా భగవంత్ వైపు తిరిగి... తమరు చాలా కాలం పాటు హాయిగా ఉండాలని, బ్యాంక్ లోన్ తీసుకుని మంచి నెయ్యి, పెరుగులాంటి పదార్థాలు తీసుకోవాలని చెప్పారు. దీంతో, సభలోని సహచర ఎంపీలు పక్కున నవ్వారు. అంతేకాదు, ఇదే భగవంత్ అయితే నెయ్యి, పెరుగు కాకుండా ఇంకేదో తీసుకోమని సూచించేవాడని సరదాగా మోదీ అన్నారు.
ఈ నేపథ్యంలో భగవంత్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో సభ గౌరవాన్ని ప్రధాని మంటగలిపారని విమర్శించారు. తనకు తాగే అలవాటు లేదని... కావాలంటే ఆల్కామీటర్ పరీక్ష చేసుకోవచ్చంటూ సవాల్ విసిరారు. ప్రధాని మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు.