: కనీసం తన సామాజిక వర్గం ఎమ్మెల్యేలు వచ్చినా.. పన్నీర్ కు సీఎం అయ్యే చాన్స్!
తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తుండగా, తదుపరి ముఖ్యమంత్రిగా శశికళ, పన్నీర్ లలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆసక్తి నెలకొనివుంది. దీనిపై రాజకీయ నాయకుల విశ్లేషణల ప్రకారం, తమిళనాడులో పన్నీర్ సెల్వం వర్గమైన దేవర్ కులానికి చెందిన ఎమ్మెల్యేలు కలిసొచ్చినా, ఆయనకే సీఎం అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. అన్నాడీఎంకేకు ఉన్న 134 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన వారుండగా, వీరు పన్నీర్ వెంట నిలిచిన పక్షంలో, డీఎంకే మద్దతుతో ఆయన పీఠాన్ని అధిరోహించ వచ్చని, ఆ సంకేతాలు వెలువడితే, మరో 30 నుంచి 40 మంది వరకూ శశికళ వర్గం నుంచి ఫిరాయిస్తారని అంచనా వేస్తున్నారు.
శశికళ క్యాంపులో 18 మంది దేవర్ కమ్యూనిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక మరో 40 మంది వరకూ అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో 20 మంది అదే సామాజిక వర్గానికి చెందిన వారని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, శశికళ సైతం దేవర్ కమ్యూనిటీ మహిళే. ఈ నేపథ్యంలో గవర్నర్ రాగానే తమిళ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.