: ఇంటికి పరిమితమైతే వేధింపులు ఉండవు... బయట తిరిగే మహిళలకే సమస్య: కోడెల
మహిళలు వంటింటికి మాత్రమే పరిమితులైతే వారికి వేధింపులు ఎదురుకావని, వ్యాపారాలు, ఉద్యోగాల పేరిట బయట తిరుగుతున్నందునే వేధింపులు జరుగుతున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో 'మీట్ ది ప్రెస్' జరుగగా, స్పీకర్ హాజరై మాట్లాడారు. మహిళలు ఉద్యోగ, వ్యాపారాలు చేయరాదన్నది తన ఉద్దేశం కాదని, వేధింపులను, ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు.
కేవలం చట్టాలు చేసినంత మాత్రాన అత్యాచారాలు, యువతుల అక్రమ రవాణా తదితరాలు ఆగవని, వాటిని ఎదుర్కొనే ధైర్యం మహిళల్లో పెరగాలని కోరారు. అందుకోసమే మూడు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేశామని అన్నారు. రాజకీయాల్లో భాగంగా గతంలో 12 గంటలు కష్టపడేవాడినని, ఇప్పుడు స్పీకర్ గా పెద్దగా పనిలేక, ఆలోచించి, మహిళా సాధికారతపై సమావేశాలు నిర్వహించాలని భావించి ఈ సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. సదస్సుకు పలు దేశాల నుంచి 60 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారని వివరించారు.