: నీ కొడుక్కి దెయ్యం పట్టిందన్న స్వామీజీ.. కొడుకును చంపేసిన తండ్రి!


నీ కొడుక్కి దెయ్యం పట్టిందని చెప్పిన ఓ స్వామీజీ మాటలు విని కన్న కొడుకును కడతేర్చాడో ప్రబుద్ధుడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిందీ ఘటన. స్థానికుల కథనం ప్రకారం.. జలదంకి మండలం గట్టుపల్లికి చెందిన గోపిశెట్టి శ్రీనివాసులకు మూఢ విశ్వాసాలు ఎక్కువ. ఇతడికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అశోక్(23) ఐటీఐ చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల కుటుంబం కష్టాల్లో చిక్కుకోవడంతో శ్రీనివాసులు ఓ స్వామీజీని ఆశ్రయించాడు.

అశోక్‌ను చూసిన స్వామీజీ అతడికి దెయ్యం పట్టిందని, కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి పొట్టపై ఒత్తితే దెయ్యం పోయి అతడి ఒంట్లోకి దేవుడు ప్రవేశిస్తాడని చెప్పాడు. తద్వారా కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కుతుందన్నాడు. స్వామీజీ మాటలను నమ్మిన శ్రీనివాసులు, భార్య మాధవిని ఒప్పించి అశోక్‌ను తాళ్లతో కట్టి నోట్లో గుడ్డలు కుక్కి పొట్టపై బలంగా ఒత్తారు. దీంతో అశోక్ ఊపిరాడక మృతి చెందాడు. దీంతో భయపడిన శ్రీనివాసులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా, ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.  

  • Loading...

More Telugu News