: జియో, ఎయిర్‌టెల్ మాటల యుద్ధంపై ట్రాయ్ కీలక వ్యాఖ్యలు
ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటర్ కనెక్ట్ పాయింట్లు వినియోగదారులకు సంబంధించిన అంశమని పేర్కొంటూ చేతులు దులుపుకుంది. అయితే ఈ వ్యవహారంలో తమ పర్యవేక్షణ కూడా ఉంటుందని నొక్కి చెప్పింది. ఇంటర్ కనెక్ట్ పాయింట్ల అంశంపై కూలంకషంగా చర్చిస్తున్నట్టు పేర్కొన్న ట్రాయ్ ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని, వినియోగదారుడికి సంబంధించినదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు.
‘వెల్‌కమ్ ఆఫర్’తో జియో మార్కెట్లోకి దూసుకొచ్చిన తొలి రోజు నుంచి ఇంటర్ కనెక్ట్ పాయింట్ల విషయంలో జియో, భారతీ ఎయిర్‌టెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సరైన ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే కాల్స్ డ్రాపవుతున్నాయంటూ జియో ఆరోపిస్తోంది. అయితే తాము 19 కోట్ల మందికి సరిపడే సామర్థ్యంతో ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, అయితే వాటిని చైతన్యం చేయడంలో విఫలమైన జియో అనవసర ఆరోపణలు చేస్తోందని ఎయిర్‌టెల్ చెబుతోంది. ఎయిర్‌టెల్ విమర్శలను జియో కొట్టిపారేసింది. ఎయిర్‌టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని, వినియోగదారుల వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది.