: వాటిని ఎలా నమ్మరో, పవన్ నన్ను కొట్టారనడాన్ని కూడా నమ్మొద్దు: షకలక శంకర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో హాస్యనటుడు షకలక శంకర్ ఓ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే, షకలక శంకర్ ను ఆ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కొట్టాడనే వదంతులు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ, ఆ వదంతులను కొట్టిపారేశాడు.
తనదైన శైలిలో సమాధానమిస్తూ.. ‘భక్తుడు అన్నమయ్యను శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొట్టారంటే నమ్ముతారా? భక్త రామదాసును శ్రీరాముడు కొట్టారంటే నమ్ముతారా? వాటిని ఎలా నమ్మరో, పవన్ నన్ను కొట్టాడరనడాన్ని కూడా నమ్మొద్దు. ఎందుకంటే, ఆయన శ్రీ వేంకటేశ్వరుడు అయితే, నేను అన్నమయ్యను. ఆయన శ్రీరాముడు అయితే, నేను భక్త రామదాసును. ఆయన దేవుడైతే నేను భక్తుడిని. నాకు, పవన్ కు ఉన్న సంబంధం అలాంటిదే. ఈ జీవితం ఉన్నంత వరకూ ఆయనే నా దేవుడు.
సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ లో ఆయనతో సంవత్సరం పాటు ఉన్నాను. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం ఆయనది. అటువంటి వ్యక్తి ఎవరినైనా ఏమంటారు? బిజీగా ఉండే ఆయన ఓ మాట అన్నా, కసిరినా సర్దుకుపోవాలి. పవన్ నా భుజంపై చేయి వేసి, కళ్లలోకి చూస్తూ ‘నేనంటే ఎందుకురా నీకు అంత ఇష్టం?’ అని ఒకసారి అడిగారు. దానికి నేను ఏం చెబుతాను? ఆయన నాకు దేవుడు.. నేను భక్తుడిని?" అంటూ పవన్ పై తనకు ఉన్న అభిమానాన్ని షకలక శంకర్ చాటుకున్నాడు.